యువకుడి దాతృత్వం.. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కోసం ఖరీదైన కారు అమ్మేశాడు - Trending Telugu News Headlines Today- Best Telugu News

Breaking

Thursday, April 22, 2021

యువకుడి దాతృత్వం.. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కోసం ఖరీదైన కారు అమ్మేశాడు

కరోనా సంక్షోభం దేశాన్ని మరో విపత్తుకి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నాయి. వేధిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో కోవిడ్ రోగులు చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, ఔషధాల కొరత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితులను ఆదుకోడానికి పలువురు ముందుకొచ్చి పెద్ద మనసును చాటుకుంటున్నారు. ముంబయిలో ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్న రోగుల కోసం ఓ యువకుడు ఏకంగా కంట్రోల్ రూమ్‌నే ఏర్పాటుచేశాడు. మలాద్‌కు చెందిన షాన్‌వాజ్ షేక్ (31) ఆ ప్రాంతంలో ‘ఆక్సిజన్ మేన్’‌గా గుర్తింపు పొందాడు. ఒక్క ఫోన్ కాల్‌తో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ ఏర్పాటుచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. గతేడాది నుంచి అవిశ్రాంతిగా కరోనా బాధితులకు సాయం చేస్తూ కష్టకాలంలో అండగా నిలుస్తున్నాడు. గతేడాది తన స్నేహితుడి భార్య ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడంతో ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదని షాన్‌వాజ్ భావించాడు. స్నేహితుడి భార్యను ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె ఊపిరి ఆగిపోయింది. సంక్షోభ సమయాల్లో నిస్సహాయకులకు సహాయం చేయాలనే సంకల్పం అప్పడే అతడిలో బలపడింది. దీంతో తన ఖరీదైన ఎండీవర్ కారును అమ్మేసి.. వచ్చిన రూ.22 లక్షల సొమ్ముతో ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలుచేశాడు. ఇప్పటి వరకూ 160 సిలిండర్లు కొనుగోలుచేసి 4,000 మంది బాధితులకు ఆక్సిజన్ అందజేశాడు. ఆక్సిజన్‌కు డిమాండ్ చాలా పెరిగిందని తెలిపాడు. మూడు నెలల కిందట తనకు రోజూ 50 వరకు కాల్స్ రాగా.. ప్రస్తుతం 500 నుంచి 600 వరకు వస్తున్నాయని అన్నాడు. ఆక్సిజన్ వినియోగించిన తర్వాత ఖాళీ సిలిండర్‌ను తిరిగి పంపేస్తుంటారని అతడి బృందం తెలిపింది. కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన యోధుల్లో షాన్‌వాజ్ ఒకరు. పట్నాకు చెందిన గౌరవ్ రాయ్ అనే వ్యక్తి కూడా కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేసి 950 మంది వరకూ ప్రాణాలను కాపాడాడు. తన వాహనంలోనే సిలిండర్లను వేసుకుని హోం క్వారంటైన్‌లో ఉన్నవారి వద్దకు వెళ్లి అందజేస్తుంటాడు. ఉదయం 5 గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లే గౌరవ్.. కొన్నిసార్లు అర్ధరాత్రి దాటిన తర్వాతే తిరిగి వెళుతుంటాడు. ఈ సేవలకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోరు. గతేడాది నుంచి ఒక్క రోజుకూడా విరామం లేకుండా సేవ చేస్తూనే ఉన్నాడు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3nb3SOR

No comments:

Post a Comment

If you have any doubts, please let us know.

Pages