
కోవిడ్ బాధితులకు కొన్ని ఆస్పత్రులు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌కు తిరస్కరించడంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తీవ్రంగా స్పందించింది. నగదురహిత చికిత్సలకు నిరాకరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్ని బీమా కంపెనీలను కోరింది. ఈమేరకు జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సర్క్యులర్ జారీ చేసింది. ‘‘బీమా పాలసీదారులకు పాలసీ ప్రకారం నగదు రహిత చికిత్సకు అర్హులైనప్పటికీ కోవిడ్ -19 బాధితులకు ఆసుపత్రులు నగదు రహిత చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నట్టు కొన్ని నివేదికలు ఉన్నాయి.. నెట్‌వర్క్ ఆస్పత్రులు కోవిడ్ -19 చికిత్సతో సహా అన్ని చికిత్సలకు నగదు రహితంగా అందించాల్సిన బాధ్యత ఉంది... ఈ విషయంలో బీమా సంస్థలు ఆయా ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేయాలి’’ అని పేర్కొంది. ‘‘సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలతో సేవా చట్టపరమైన ఒప్పందాలపై సంతకం చేసిన అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులు, కోవిడ్ -19తో సహా పాలసీదారులకు ఏదైనా చికిత్స కోసం నగదు రహిత సదుపాయాన్ని “తప్పనిసరి”గా అందించాలి’’ అని స్పష్టం చేసింది. అంతకుముందు ఇదే విషయంపై ఛైర్మన్ ఎస్‌సీ కుంతియాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించారు. గత ఏడాది మార్చిలోనే కొవిడ్‌ను కూడా కాంప్రహెన్సివ్ హెల్త్ స్కీమ్‌లో చేర్చారు. తద్వారా నెట్‌వర్క్ ఆస్పత్రులతోపాటు తాత్కాలిక కొవిడ్ హాస్పిటల్స్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఫోన్ కన్సల్టేషన్‌కు అయిన ఖర్చులను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ నిబంధనలు అమలుచేయని ఆస్పత్రులపై పాలసీదారులు సంబంధిత బీమా కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 20 నాటికి 9 లక్షల కొవిడ్ సంబంధిత ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను బీమా కంపెనీలు సెటిల్ చేశాయి. తద్వారా రూ.8,642 కోట్లు విడుదల చేశాయి. దేశంలో రెండో దశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. రెండు రోజుల నుంచి రోజుకు 3 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3tLAWPU
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.